బిగ్‌బాస్‌ అనైతికం.. అడ్డుకోండి

హైదరాబాద్‌: ఈ నెల 21 నుంచి ‘స్టార్‌ మా’లో ప్రసారానికి సిద్ధమవుతున్న బిగ్‌బాస్‌-3ను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బిగ్‌బాస్‌ కార్యక్రమం అనైతికంగా ఉందని దీన్ని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎలాంటి సెన్సార్‌ లేకుండా అసభ్యంగా, విశృంఖల శృంగార ఘట్టాలు, అసభ్యత, హింస, రెచ్చగొట్టేలా, దురుసు ప్రవర్తన, అనైతిక చర్యలు, అసాంఘిక చర్యలతో జనజీవితాన్ని తప్పుదారి పట్టించేలా కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు వస్తుందంటూ నటులను ఆకర్షిస్తారన్నారు. అక్కడ పాల్గొనే వారిలో కుట్రలు పన్నేలా నిర్వాహకులు రెచ్చగొడతారన్నారు. దీనివల్ల బాధితులు ఎప్పుడోగానీ బయటికి రారన్నారు. ఇప్పటికే దీనిపై బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈనెల 21న ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కమిషనర్‌, కలెక్టర్‌, ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ బోర్డు, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (మా టీవీ), ఇండియన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫౌండేషన్‌, ఎండెమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ లిమిటెడ్‌లను చేర్చారు.

కేసు కొట్టివేయండి:
తనపై బంజారాహిల్స్‌, రాయ్‌దుర్గం పోలీసు స్టేషన్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ బిగ్‌బాస్‌ కార్యక్రమం నిర్వాహకుడు అభిషేక్‌ ముఖర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలని కోరారు.

Leave a Reply